బీజేపీకి ఝలక్ ఇద్దామని అనుకుంటే.. ఊహించని షాకిచ్చిన యూపీ పోలీసులు

Arrest warrant issued against ex-UP minister Swami Prasad Maurya in 7-year-old case. స్వామి ప్రసాద్ మౌర్య.. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న ఆయన

By Medi Samrat
Published on : 12 Jan 2022 8:47 PM IST

బీజేపీకి ఝలక్ ఇద్దామని అనుకుంటే.. ఊహించని షాకిచ్చిన యూపీ పోలీసులు

స్వామి ప్రసాద్ మౌర్య.. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న ఆయన మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయన వెంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడనున్నారనే వార్త యూపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌ ఆనందిబెన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. కార్మిక మంత్రిగా నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ యోగి కేబినెట్‌లో అంకిత భావంతో పని చేశానని అన్నారు. కానీ దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న మధ్య తరగతి వ్యాపారుల్ని అణచివేస్తూ, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మౌర్య రాజీనామా లేఖ వైరల్ అయ్యాక.. ముగ్గురు ఎమ్మెల్యేలైన రోషన్‌ లాల్‌ వర్మ, బ్రజేష్‌ ప్రజాపతి , భగవతి సాగర్‌ వినయ్‌ శాఖ్యలు తాము మౌర్యకు మద్దతుగా పార్టీని వీడుతామని ప్రకటించారు. కేబినెట్‌కు రాజీనామా చేసిన వెంటనే మౌర్య నేరుగా సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. మౌర్యతో కలిసి ఉన్న ఫొటోను అఖిలేశ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేస్తూ పార్టీలోకి ఆయనకి స్వాగతం పలికారు.

అలా బీజేపీకి షాక్ ఇచ్చానని మౌర్య భావించగా.. 24 గంటల్లో ఊహించని ఝలక్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇచ్చారు. యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీ నుంచి వైదొలిగిన మరుసటి రోజే, ఏడేళ్ల నాటి కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మౌర్య దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 2014 కేసుకు సంబంధించిన అరెస్ట్ వారెంట్ అది. దీనిపై ఎంపి-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు జనవరి 24న విచారణ చేపట్టనుంది.




Next Story