PSLV-C62 విఫలం..ఇస్రోకు మరో ఎదురుదెబ్బ, ‘అన్వేష’తో పాటు కీలక ఉపగ్రహాల నష్టం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి మరోసారి నిరాశ ఎదురైంది.
By - Knakam Karthik |
PSLV-C62 విఫలం..ఇస్రోకు మరో ఎదురుదెబ్బ, ‘అన్వేష’తో పాటు కీలక ఉపగ్రహాల నష్టం
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కి మరోసారి నిరాశ ఎదురైంది. దేశానికి ‘వర్క్‌హార్స్ రాకెట్’గా పేరున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మరోసారి తడబడింది. 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగమైన PSLV-C62 మిషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సోమవారం ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన PSLV-C62, మూడో దశ (PS3) చివర్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా తన గమ్య మార్గం నుంచి దారి తప్పింది. దీంతో EOS-N1 (అన్వేష) హైపర్‌స్పెక్ట్రల్ ఉపగ్రహంతో పాటు పలు వాణిజ్య ఉపగ్రహాలు కోల్పోయినట్టు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
ఇస్రో చైర్మన్ స్పందన
ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ప్రయోగం అనంతరం మాట్లాడుతూ, “నాలుగు దశలతో కూడిన PSLV రాకెట్ మూడో దశ ముగింపు సమయంలో అనుకోని ‘డిస్టర్బెన్స్’ కనిపించింది. ఆ తర్వాత ఫ్లైట్ పాత్‌లో డివియేషన్ నమోదైంది. డేటాను విశ్లేషిస్తున్నాం. వీలైనంత త్వరగా పూర్తి వివరాలతో ముందుకు వస్తాం” అని తెలిపారు. తరువాత ఆయన “మిషన్ ఆశించిన మార్గంలో కొనసాగలేకపోయింది” అని స్పష్టం చేశారు.
వ్యూహాత్మక నష్టం
ఈ ప్రయోగంలో ప్రధానంగా డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన అన్వేష (EOS-N1) హైపర్‌స్పెక్ట్రల్ సర్వైలాన్స్ ఉపగ్రహం ఉంది. ఇది రక్షణ అవసరాల కోసం భూమిపై పదార్థాల గుర్తింపు, భూభాగ విశ్లేషణ, గూఢనిఘా సామర్థ్యాలకు కీలకం. ఈ ఉపగ్రహం కోల్పోవడం రక్షణ రంగానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
అనుమానాలు, విమర్శలు
అయితే కొందరు రక్షణ రంగ నిపుణులు వరుసగా వ్యూహాత్మక ఉపగ్రహాలే విఫలమవుతున్నాయనే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “GISAT, RISAT-1B, NVS-02, ఇప్పుడు అన్వేష… ఇవన్నీ కీలక మిషన్లే. ఇది యాదృచ్ఛికమా? లేక ఏదైనా వ్యవస్థాగత లోపమా? లేదా బాహ్య జోక్యమా?” అంటూ ఒక సీనియర్ రక్షణ నిపుణుడు ప్రశ్నించారు.
ఇటీవల విఫలమైన కీలక మిషన్లు
GISAT-1 / EOS-03 (2021) – GSLV క్రయోజెనిక్ దశ లోపం
RISAT-1B / EOS-09 (మే 2025) – PSLV మూడో దశ లోపం
NVS-02 (జనవరి 2025) – నావిక్ ఉపగ్రహంలో అపోజీ మోటార్ విఫలం
Anvesha / EOS-N1 (జనవరి 2026) – PSLV-C62 మిషన్ విఫలం
పారదర్శకతపై ప్రశ్నలు
గతంలో ఇస్రో ప్రతి విఫల ప్రయోగంపై ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ (FAC) నివేదికలను బహిర్గతం చేసేది. అయితే ఇటీవలి విఫలాలపై పూర్తి నివేదికలు బయటకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గగనయాన్ వంటి మానవ సహిత మిషన్లకు ఇది ఆందోళనకర అంశమని నిపుణులు చెబుతున్నారు.