నుపుర్ శర్మ వివాదం : మ‌రో హ‌త్య‌.. ఎన్ఐఏ దర్యాప్తు

another murder in Maharashtra over post on Nupur Sharma. మహారాష్ట్రలోని అమరావతిలో బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా

By Medi Samrat  Published on  2 July 2022 3:15 PM GMT
నుపుర్ శర్మ వివాదం : మ‌రో హ‌త్య‌.. ఎన్ఐఏ దర్యాప్తు

మహారాష్ట్రలోని అమరావతిలో బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై 54 ఏళ్ల కెమిస్ట్‌ని నరికి చంపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ను ఇద్దరు వ్యక్తులు నరికి చంపడానికి ఒక వారం ముందు జూన్ 21 న అమరావతిలో ఉమేష్ ప్రహ్లాదరావు కోల్హేను కత్తితో పొడిచి చంపారు. ఉమేష్ ప్రహ్లాదరావు కోల్హే హత్యపై స్థానిక బీజేపీ నాయకులు పోలీసులకు లేఖ సమర్పించారు. పగ తీర్చుకోవడానికే అతన్ని చంపారని ఆరోపించారు. బీజేపీ నేతల నుంచి తమకు లేఖ అందిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

"కొల్హే అమరావతి నగరంలో మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కొన్ని వాట్సాప్ గ్రూపులలో అతను ఒక పోస్ట్‌ను షేర్ చేసాడు. అతను తన కస్టమర్లతో సహా కొంతమంది ముస్లింలు కూడా సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో పొరపాటుగా పోస్ట్‌ను పంచుకున్నాడు." అని సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారి PTI కి చెప్పారు. NIA బృందం అమరావతికి చేరుకుంది. దర్యాప్తును చేపడుతుంది. ఈ విషయాన్ని NIA బృందం పరిశీలించి మహారాష్ట్ర పోలీసుల నుంచి వివరాలు తీసుకుంటోంది. "అమరావతిలో ఉమేష్ కొల్హే అనాగరిక హత్యకు సంబంధించిన కేసు దర్యాప్తును NIAకి అప్పగించారు. హత్య వెనుక కుట్ర, సంస్థల ప్రమేయం మరియు అంతర్జాతీయ సంబంధాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయబడుతుంది" అని హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. మహారాష్ట్ర ఏటీఎస్‌ బృందం దీనిపై విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఉదయ్‌పూర్ నిందితుల మాదిరిగానే అమరావతి నిందితులు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించారా అనే కోణంలో కూడా ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది.

జూన్ 21న రాత్రి 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య అతడి హత్య ఘటన చోటుచేసుకుంది. తన దుకాణం మూసి ద్విచక్ర వాహనంపై కొల్హే ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతడితో పాటు తన కుమారుడు సంకేత్ (27), భార్య వైష్ణవి వేరే వాహనంపై వెళ్తున్నారు. వారందరూ విమెన్స్ కాలేజ్ గేటు దగ్గరకు రాగానే వెనుక నుంచి ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు కోల్హేను అడ్డుకున్నారు. ఓ యువకుడు మోటార్‌సైకిల్‌పై నుంచి దిగి పదునైన ఆయుధంతో కోల్హే మెడపై పొడిచి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సంకేత్ అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని అధికారి తెలిపారు. పోలీసులు నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.












Next Story