పవర్ స్టేషన్‌కు తాళం వేసిన గ్రామస్ధులు.. ఎందుకంటే..
Angry villagers close power station. ఐదు రోజులుగా కరెంటు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు పవర్ స్టేషన్
By Medi Samrat Published on 1 Aug 2022 7:24 PM IST
ఐదు రోజులుగా కరెంటు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు పవర్ స్టేషన్ తలుపులు మూసివేశారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని హుక్మావాలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తలుపులు మూసివేసిన గ్రామస్తులు అంతటితో ఆగకుండ వెంటనే విద్యుత్ సరఫరా చేయకుంటే విద్యుత్ కేంద్రానికి నిప్పు పెడతామని బెదిరించారు. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు విద్యుత్ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.
గ్రామంలో 220కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు పంచాయతీ శాఖకు 14 ఎకరాల భూమి ఇచ్చామని, దానికి ప్రతిఫలంగా 24 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే గత 5 నుంచి 7 రోజులుగా కరెంటు రావడం లేదు. అధికారులను సంప్రదించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈరోజు 220కేవీ సబ్‌స్టేషన్‌కు తాళం వేశామని.. కరెంటు సమస్య పరిష్కరించే వరకు నిరసన చేస్తామని స్థానిక నివాసి రామ్ సింగ్ అన్నారు.
కరెంటు లేక గ్రామస్తులంతా అల్లాడుతున్నారు. పిల్లలు నిద్రపోవడం లేదు. గ్రామంలో కరెంటు సదుపాయం కల్పించకపోతే మేం నిరసన కొనసాగిస్తాం. అధికారులు అప్పటికీ వినకపోతే, మేము పవర్ హౌస్‌ను ధ్వంసం చేసి నిప్పంటిస్తామని స్థానిక నివాసి బల్బీర్ సింగ్ అన్నారు.
ఇదిలావుంటే.. వర్షాల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ పాడైపోయిందని.. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని హర్యానా బిజిలీ విత్రన్ నిగం (హెచ్‌బివిఎన్) జెఇ పవన్ కుమార్ తెలిపారు. లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉన్నతాధికారులకు తెలిపి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను తెప్పించి విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.