వెరైటీ కోసం ఓ వ్యక్తి చేసిన పని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకి ఆగ్రహం తెప్పించింది. ఓ వైపు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న వేళ.. వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్క్‌ను ముక్కు, నోటికి కాకుండా కళ్లకు పెట్టుకుని లోక్‌ల్ ట్రైన్‌లో ప్రయాణించాడో వ్యక్తి. ఆ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన మహీంద్రా.. సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇటీవల ముంబయిలో కొవిడ్ కేసులు పెరగడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇలాంటి ప్రయత్నాలు ఎంతమాత్రం అభినందనీయం కాదు' అని రాసుకొచ్చారు.
గత కొంతకాలంగా మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు సగం కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు పెట్టుకునేలా మార్షల్స్‌ను నియమించింది. రాష్ట్ర ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేదంటే మళ్లీ లాక్‌డౌన్ పెట్టాల్సి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు.