పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'చొరబాటుదారుల' అంశంపై టీఎంసీ లక్ష్యంగా పదునైన విమర్శలు చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన బీజేపీ 'పరివర్తన్ యాత్ర'లో పాల్గొన్న ఆయన, బెంగాల్‌ను మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదారులకు స్వర్గధామంగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చొరబాటుదారుడిని గుర్తించి బయటకు పంపేస్తామని షా హెచ్చరించారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని, దీనికే మమతా దీదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణలో దాదాపు 63.66 లక్షల పేర్లను (8.3 శాతం) తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 7.04 కోట్లకు తగ్గింది. చొరబాటుదారుల వల్లే సరిహద్దు రాష్ట్ర భద్రత ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాల నుండి హింసకు గురై వచ్చిన హిందూ శరణార్థులు ఎవరూ పౌరసత్వం కోల్పోరని, వారికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చొరబాటుదారులకు, శరణార్థులకు మధ్య వ్యత్యాసం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
టీఎంసీ ప్రభుత్వం అవినీతిని, చొరబాట్లను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మమతా బెనర్జీ ఆలయాల ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు మసీదుల నిర్మాణానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ భద్రత కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.