చర్చలు వారితో జరపాలన్నదే మా ఆకాంక్ష.. పాకిస్థాన్‌తో కాదు.!

Amit shah latest comments. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ను చూడాలన్నదే ప్రధాని మోడీ ఆశయమన్నారు కేంద్రహోంమంత్రి

By అంజి
Published on : 26 Oct 2021 9:48 AM IST

చర్చలు వారితో జరపాలన్నదే మా ఆకాంక్ష.. పాకిస్థాన్‌తో కాదు.!

దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ను చూడాలన్నదే ప్రధాని మోడీ ఆశయమన్నారు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా. కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఎస్‌కేఐసీసీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్‌ పాల్గొని ప్రసంగించారు. మాట్లాడే ముందు తను ధరించిన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కవచాన్ని తొలగించారు. జమ్ము కశ్మీర్‌ ప్రజలతో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధ్యానతను ఇస్తోందన్నారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్‌ దేశంతో చర్చలు జరపాలపి నేషన్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను అమిత్‌షా తోసిపుచ్చారు. కశ్మీర్‌ సమస్య గురించి ఫరూక్‌ చేసిన సూచనను న్యూస్‌ పేపర్‌లో చదివానని, అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఆయనకుందన్నారు.

అయితే కశ్మీర్‌ సోదరులు, సోదరిలు, యువతతోనే ప్రత్యక్షంగా చర్చలు జరపాలన్నది తమ ఆకాంక్ష అని అమిత్‌ షా పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌, లఢక్‌లను అభివృద్థి మార్గంలోకి తీసుకురావలన్న ఉద్దేశంతోనే ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని అమిత్‌ షా మరోసారి తెలిపారు. 2024 కల్లా జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుస్తుందన్నారు. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అక్కడి వారికి వివరించారు. 2022 సంవత్సరం చివరికల్లా దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అమిత్‌ షా భరోసా వ్యక్తం చేశారు. స్థానిక యువతకు 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అమిత్‌ షా చెప్పారు. పర్యటన నేపథ్యంలో కశ్మీరీ పండిట్ల ఆరాధ్య దేవత ఖీర్‌ భవానీ ఆలయాన్ని కేంద్రహోంమంత్రి అమిత్‌ షా సందర్శించారు.

Next Story