రాజ్యానికి సవాల్ విసిరితే మూల్యం చెల్లించుకోవాల్సిందే.. అమిత్ షా వార్నింగ్
దేశంలో నక్సలిజం కోరలు పీకేసి, రక్తపాతానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ వేదికగా స్పష్టం చేశారు
By - Knakam Karthik |
రాజ్యానికి సవాల్ విసిరితే మూల్యం చెల్లించుకోవాల్సిందే.. అమిత్ షా వార్నింగ్
దేశంలో నక్సలిజం కోరలు పీకేసి, రక్తపాతానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ వేదికగా స్పష్టం చేశారు. ముఖ్యంగా మావోయిస్టులకు ఒకప్పటి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఇప్పుడు వారి ఉనికి నామమాత్రమేనని, 'ఆపరేషన్ కగార్' ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని మట్టికరిపించామని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలోనే 706 మంది మావోయిస్టులు హతం కాగా, 4,800 మందికి పైగా లొంగిపోయారని కీలక గణాంకాలను వెల్లడించారు. ఆయుధాలు పట్టి రాజ్యానికి సవాల్ విసిరితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని ఆయన హెచ్చరించారు.
దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదని, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని అమిత్ షా నిలదీశారు. నక్సలిజం అనేది పేదరికం వల్ల పుట్టింది కాదని, అదొక విధ్వంసకర ఆలోచన అని మండిపడ్డారు. మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాలు నడుపుతూ రోడ్లు, పాఠశాలలు వంటి అభివృద్ధి పనులను అడ్డుకున్నారని, ప్రజలను ఓటు వేయకుండా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. మానవ హక్కుల గురించి మాట్లాడేవారు మావోయిస్టుల హింసకు బలైన అమాయక ప్రజల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
సమస్య ఏదైనా రాజ్యాంగబద్ధంగా, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, తుపాకీ పట్టిన వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమిత్ షా తెగేసి చెప్పారు. ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరే వారితో మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాల సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైందని, బస్తర్ వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.