భారత్ లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే..! తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అర్హులైన వ్యక్తులు వ్యాక్సిన్ కోసం తమ వివరాలను ఇవ్వాలని కోరారు. భారతదేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కరోనా వ్యాక్సిన్ ను ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల పైబడిన వారికి వేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు వేశారు.
దేశంలో గత 24 గంటల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ అయిందని.. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. కొత్తగా అదే సమయంలో 29,785 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 199 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు. 3,45,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.