స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు చేశాయి. దేశ రాజధానిలో భారీ ఉగ్రదాడి జరగొచ్చని ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 15 న దాడి జరగొచ్చనే విషయమై భద్రతా సంస్థల నుండి హై అలర్ట్ వచ్చింది. ఢిల్లీ పోలీసులు ఆగస్టు 15 ముందు ఉగ్రవాద కార్యకలాపాల గురించి హెచ్చరించారు. డ్రోన్ దాడి జరగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరికను జారీ చేశాయి. డ్రోన్ల సాయంతో ఢిల్లీపై విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు నిఘా సంస్థలు తెలిపాయి. ఆగస్టు 15కి ముందే దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. కశ్మీర్ సరిహద్దుల్లో గుర్తుతెలియని డ్రోన్ల సంచారం అధికమైంది.
జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్థావరం వద్ద డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. ఇప్పుడు ఢిల్లీపై డ్రోన్ అటాక్ జరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే ఉగ్రవాదులు ఈ దాడికి ప్రణాళికలు వేస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే తెలిపింది. ముఖ్యంగా ఆగస్టు 5 న మోదీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. అదే రోజున ఈ ఆపరేషన్ చేపట్టడానికి ఉగ్రవాదులు పెద్ద డ్రోన్ దాడిని ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు హెచ్చరించాయి. సమాచారం వచ్చిన తరువాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.