ఢిల్లీ ప్రభుత్వం తన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. సంవత్సరంలో మద్యం షాపుల మూసివేత రోజుల సంఖ్యను 3 రోజులకు తగ్గించింది. ఇది గత ఏడాది 21 రోజులుగా ఉండేది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి అక్టోబర్ 2 నాడు లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు, నల్లమందు దుకాణాలు మూసివేయబడతాయని ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విభాగం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. "ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2010లోని రూల్ 52లోని నిబంధనలను అనుసరించి, ఎక్సైజ్ శాఖ, నల్లమందు విక్రయదారుల లైసెన్సులందరూ ఢిల్లీలోని జాతీయ రాజధాని భూభాగంలో ఈ క్రింది తేదీలను "నిషేధిత"గా పాటించాలని ఆదేశించింది. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతిని మద్యం అమ్మకాలు అనుమతించబడని రోజులుగా జాబితా చేసింది.
ఎల్-15 లైసెన్స్ ఉన్న హోటళ్ల విషయంలో డ్రై డేస్‌లో మద్యం అమ్మకాలపై ఉన్న పరిమితి నివాసితులకు మద్యం సేవకు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకు ముందు, గొప్ప నాయకుల జన్మదినోత్సవం, మతపరమైన పండుగలతో సహా 21 డ్రై డేలు ఉన్నాయి. డ్రై డే రోజున లైసెన్స్‌దారు వ్యాపార ప్రాంగణాలు మూసివేయబడతాయి. పైన పేర్కొన్న మూడు డ్రైడేలు కాకుండా, సంవత్సరంలో ఏ రోజునైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు 'డ్రై డే'గా ప్రకటించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. 'డ్రై డేస్' సంఖ్యకు సంబంధించిన ఏవైనా మార్పుల కారణంగా లైసెన్సుదారులు ఎటువంటి పరిహారం పొందలేరు.