పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్అలీ జిన్నాను యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ విపరీతంగా పొగిడేసి చిక్కుల్లో పడ్డాడు. హర్దోయ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులు అయ్యారన్నారు. వీరందరూ భారత స్వాత్రంత్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. అఖిలేష్ యాదవ్ మహమ్మద్ అలీ జిన్నా దేశ స్వాతంత్య్ర సమరవీరుల్లో ఒకరని చెప్పుకొచ్చారు. సర్దార్ పటేల్‌కు ఈ భూమి గురించి తెలుసు కాబట్టే పలు నిర్ణయాలు తీసుకున్నారు, అందుకే ఆయన్ని ఉక్కు మనిషి అని పిలుస్తారు.
ఇక సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, జిన్నా ఇలా అందరూ ఒకే సంస్థ నుంచి బయటకు వచ్చారు. వాళ్లంతా ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నారు, బారిస్టర్‌లుగా మారి భారత్ కు స్వేచ్ఛను ఇచ్చారని అఖిలేష్ వ్యాఖ్యలు చేశారు. జిన్నాను స్వాతంత్ర్య సమరయోధుడిగా అఖిలేశ్ పేర్కొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. జిన్నా చరిత్రను ఒకసారి తెలుసుకోవాలని.. హిందువులపై సామూహిక హత్యాకాండను జిన్నా ప్రోత్సహించారని, దేశ విభజనకు కారణమైన వ్యక్తిని ప్రశంసించడం మానుకోవాలని పలువురు నేతలు విమర్శించారు. ముస్లింల ఓట్ల కోసం ఎవరినైనా పొగిడే విధానాన్ని మానుకోవాలని మరికొందరు నేతలు అఖిలేష్ కు హితవు పలికారు.