ధరలు పెంచేస్తున్నారా..? ప్రయాణాల పరిస్థితి ఏంటో..!
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి.
By - Medi Samrat |
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమ విమాన టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది వారాల్లోనే ఇంధన ధర బ్యారెల్‌కు $85-$90 నుండి $150-$200 కు పెరిగింది. దీనికి ప్రతిస్పందనగా ఎయిర్ ఇండియా, ఇండిగో, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు టికెట్ ధరలు, అనేక రూట్లలో ఇంధన సర్‌ఛార్జీలను పెంచాయి. అంతేకాకుండా లగేజ్, ఇతర సేవల రుసుములను కూడా పెంచాయి. అనేక ఎయిర్‌లైన్స్ తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తూ, ఖర్చు తగ్గింపు చర్యలపై దృష్టి పెడుతున్నాయి.
ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో విధించే ఇంధన సర్‌చార్జిని దూరాన్ని బట్టి సవరించింది. తక్కువ దూరం (0–500 కి.మీ) ప్రయాణించే వారు సెక్టార్‌కు అదనంగా 299 రూపాయలు చెల్లించాలి, అలాగే 2,000 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై 899 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో, దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఏప్రిల్ 2 నుండి ఇంధన ఛార్జీలను విధిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా చేసే బుకింగ్స్‌కు దేశీయంగా ఒక సెక్టార్‌కు 950 వరకు, సుదూర అంతర్జాతీయ ప్రయాణాలపై 10,000 వరకు ఇంధన సర్‌ఛార్జ్ పడనుంది. ఇంధన ధరల పెరుగుదల కారణంతో ఆకాశ ఎయిర్ గత నెలలోనే ధరల పెంపును ప్రకటించింది. మార్చి 15 నుండి దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కొత్త బుకింగ్‌లపై ₹199 నుండి ₹1,300 వరకు ఇంధన సర్‌చార్జి వసూలు చేస్తామని తెలిపింది.