తాలిబన్లపై కూడా ఎయిర్ స్ట్రైక్స్ తప్పవు: యోగి ఆదిత్యనాథ్

Air Strike Is Ready If Taliban Moves Towards India. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను సొంతం చేసుకున్నప్పటి నుండి.. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ చేతులు

By Medi Samrat  Published on  1 Nov 2021 2:48 PM IST
తాలిబన్లపై కూడా ఎయిర్ స్ట్రైక్స్ తప్పవు: యోగి ఆదిత్యనాథ్

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను సొంతం చేసుకున్నప్పటి నుండి.. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ చేతులు కలుపుతాయనే అనుమానం ప్రతి ఒక్కరి లోనూ ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో ఇప్పటికే ఎన్నో కుయుక్తులు పన్నుతున్న పాకిస్తాన్.. తాలిబన్ల అండతో మరిన్ని దారుణాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆర్థికంగా కుదుట పడ్డాక తాలిబాన్లు మిగిలిన అంశాలపై దృష్టి సారించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అంతేకాకుండా భారత్ లో తాలిబన్లు ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. పాక్ తో కలిసి తాలిబన్లు కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని అంటున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాలిబన్లకు హెచ్చరికలు జారీ చేశారు. తాలిబన్ల వల్ల ఆఫ్ఘనిస్తాన్, పాక్ రెండు దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. భారత్ వైపు రావాలని తాలిబాన్లు ప్రయత్నిస్తే ఎయిర్ స్ట్రయిక్స్ ను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు సామాజిక ప్రతినిధి సమ్మేళనంలో మాట్లాడుతూ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వల్ల కలవరపడుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు భారతదేశం శక్తివంతంగా ఉంది, ఏ దేశమూ భారత్‌ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నాయని అన్నారు. తాలిబన్‌లు భారతదేశం వైపు కదిలితే మేము వైమానిక దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో యోగి ప్రచారంలో బిజీగా ఉన్నారు.


Next Story