తాజాగా న్యూఢిల్లీలో ఎయిర్‌ఇండియాకు చెందిన ఓ విమానం వంతెన కింద ఇరుక్కున్న వీడయో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కొంత మంది నిజంగానే విమానం రోడ్డుపై ల్యాండింగ్ అయ్యి వంతెన కింద ఇరుక్కుందని అనుకుంటున్నారు. అయితే విమానం వంతెన కింద ఇరుక్కున్న మాట వాస్తవమే కానీ.. ల్యాండింగ్ మాత్రం రోడ్డుపై కాలేదు. ఎందుకంటే అది ఓ పాతబడిన విమానం. ఓ వ్యక్తి ఎయిర్‌ఇండియా అమ్మిన పాతబడిన విమానాన్ని ట్రాలీలో తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుంది.
ఈ ఘటన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఢిల్లీ - గుర్గావ్ హైవేపై జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. తాము అమ్మిన విమానాన్ని ఓ వ్యక్తి తరలిస్తుండగా వంతెన ఇరుక్కుందని తెలిపింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. కాగా 2019వ సంవత్సంలో ఇదే విధమైన సంఘటన పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో జరిగింది. ట్రక్కు యజమాని వంతెన ఎత్తును సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.