టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం.. కార‌ణం ఇదే..!

ఎయిరిండియా విమానం కేరళలోని కాలికట్ నుండి దోహాకు బయలుదేరిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి వచ్చింది.

By Medi Samrat
Published on : 23 July 2025 2:24 PM IST

టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం.. కార‌ణం ఇదే..!

ఎయిరిండియా విమానం కేరళలోని కాలికట్ నుండి దోహాకు బయలుదేరిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి వచ్చింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత విమానం మళ్లీ కాలికట్‌లో ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.. దీంతో విమానం మధ్యలోనుంచే తిరిగి వచ్చింది.

ఎయిర్ ఇండియా విమానం IX 375 ఈరోజు ఉదయం 9:07 గంటలకు కేరళలోని కాలికట్ నుండి బయలుదేరింది. విమానంలో పైలట్, సిబ్బందితో సహా 188 మంది ఉన్నారు. ఫ్లైట్ సమయంలో విమానంలో కొంత సాంకేతిక లోపం సంభవించింది. దాని కారణంగా పైలట్ తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. విమానం 2 గంటల తర్వాత 11:12 గంటలకు కాలికట్ విమానాశ్రయంలో దిగింది.

దీనిపై సమాచారం ఇస్తూ కాలికట్ ఎయిర్‌పోర్ట్ అధికారులు.. "విమానం క్యాబిన్ ఏసీలో కొంత సాంకేతిక లోపం ఉంది. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదు. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని రిట‌ర్న్‌ తీసుకొచ్చాం."

ముందుజాగ్రత్తగా ఈ విమానాన్ని వెనక్కి పిలిపించినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలోని లోపాన్ని త్వరలోనే సరిచేసి, సమయం పడితే మరో విమానంలో ప్రయాణికులను దోహాకు పంపిస్తామన్నారు. ప్రయాణికులంతా విమానాశ్రయంలో వేచి ఉన్నారు. ప్రయాణికులకు నీరు, భోజన ఏర్పాట్లు కూడా చేశారు.

Next Story