ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ 'పేడే సేల్ ' తీసుకుని వచ్చింది. కంపెనీ దేశీయ రూట్లలో టికెట్ ధరలు రూ. 1,950 నుంచి, అంతర్జాతీయ రూట్లలో రూ. 5,990 నుంచి ఛార్జీలు మొదలవుతాయని తెలిపింది. ఈ ప్రత్యేక ఛార్జీలతో విమాన బుకింగ్‌లు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో, అలాగే అన్ని ప్రధాన బుకింగ్ ఛానెళ్లలో 2026, జనవరి 1 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు దేశీయ మార్గాలకు రూ. 1,850 నుంచి, అంతర్జాతీయ రూట్లకు రూ. 5,355 నుంచి ప్రారంభమయ్యే ఛార్జీలపై జీరో చెక్-ఇన్ బ్యాగేజీని బుక్ చేసుకోవచ్చు.
ఈ ప్రత్యేక ఛార్జీలు దేశీయ ప్రయాణానికి వచ్చే ఏడాది జనవరి 12 నుంచి అక్టోబర్ 10 వరకు, అంతర్జాతీయ ప్రయాణానికి జనవరి 12 నుంచి అక్టోబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. లైట్ ఛార్జీలలో రాయితీతో కూడిన చెక్-ఇన్ బ్యాగేజీ ధరలు కూడా ఉన్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది. దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ. 1,500, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ. 2,500 ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా చేసే అన్ని బుకింగ్‌లపై జీరో కన్వీనియన్స్ ఫీజును కూడా అందిస్తోంది ఎయిర్ ఇండియా.