ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు ఊహించని షాక్

Air India data breach. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా విమాన ప్రయాణాలు చేసిన వారికి

By Medi Samrat  Published on  22 May 2021 6:25 AM GMT
ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు ఊహించని షాక్

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా విమాన ప్రయాణాలు చేసిన వారికి ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే ఎయిర్ ఇండియా నుండి భారీగా డేటాను చోరీ చేశారు. ఎయిర్ ఇండియా అతి భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగినట్టు వెల్లడైంది. ఎయిరిండియా ప్రయాణికులకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్టు డేటా లీకైనట్టు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైనట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. వీరిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. 2011 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ డేటా హ్యాకింగ్ జరిగినట్టు తెలుసుకున్నారు. హ్యాకింగ్ జరిగిన విషయం గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిర్ ఇండియా అంటోంది.

ప్యాసెంజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌ ప్రొవైడర్‌ 'సిటా'పై గత ఫిబ్రవరిలో జరిగిన సైబర్‌ దాడి ద్వారా ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. ప్రయాణికుల పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్‌, పాస్‌పోర్ట్‌, టికెట్‌ సమాచారం, క్రెడిట్‌ కార్డు డేటా వంటి వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. 2011 ఆగస్టు 11 నుంచి 2021 ఫిబ్రవరి 3 మధ్య రిజిస్టర్‌ అయిన ప్రయాణికుల సమాచారం ఉంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా సిటా కార్యకలాపాలు సాగిస్తోంది. కార్డు వెనకల గల సీవీవీ, సీవీసీ నంబర్లు వారికి తెలియవు అని చెప్పింది. ఎవరీ డేటా లీకయ్యిందని దానికి సంబంధించి మెయిల్ చేశామని వివరించింది. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఎయిర్‌ ఇండియా తెలిపింది. తమ వ్యక్తి సమాచార భద్రత కోసం ప్రయాణికులు అవసరమైన పాస్‌వర్డ్‌లను మార్చుకోమని సూచిస్తోంది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని కంపెనీ తెలియజేసింది.


Next Story