వ్యాక్సిన్ తీసుకోనన్న ఐఏఎఫ్‌ ఎయిర్‌మ్యాన్‌.. ఉద్యోగం నుండి తొలగింపు..!

Air Force Sacks Airman For Refusing To Get Vaccinated Against COVID-19. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని భారత ప్రభుత్వం చెబుతూ ఉంది.

By Medi Samrat  Published on  12 Aug 2021 2:18 PM GMT
వ్యాక్సిన్ తీసుకోనన్న ఐఏఎఫ్‌ ఎయిర్‌మ్యాన్‌.. ఉద్యోగం నుండి తొలగింపు..!

కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని భారత ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వాళ్లు, కీలక విభాగాల్లో ఉన్న వాళ్లు వ్యాక్సిన్ వేసుకోడానికి నిరాకరిస్తూ ఉన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మ్యాన్ పై చర్యలు తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు నిరాకరించిన ఎయిర్‌మ్యాన్‌ను భారత వాయుసేన సర్వీస్‌ నుంచి తొలగించింది. అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ ఈ మేరకు బుధవారం గుజరాత్‌ హైకోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐఏఎఫ్‌కు చెందిన 9 మంది సిబ్బంది టీకా వేయించుకునేందుకు నిరాకరించారని, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా ఒక్క వ్యక్తి మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో స్పందించని ఆ ఎయిర్‌మ్యాన్‌ను ఉద్యోగం నుంచి ఐఏఎఫ్‌ తొలగించింది.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌బేస్‌లో విధులు నిర్వహించే కార్పొరల్‌ యోగేంద్ర కుమార్, కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్‌ అతడికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. కరోనా టీకా వేయించుకునేందుకు నిరాకరించిన ఆయనను ఎందుకు సర్వీస్‌ నుంచి తొలగించకూడదో వివరణ ఇవ్వాలన్నది. ఈ ఏడాది మే 10న ఐఏఎఫ్‌ జారీ చేసి షాకాజ్‌ నోటీస్‌పై యోగేంద్ర కుమార్‌, గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. టీకా తీసుకోవడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని, తప్పనిసరి కాదన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని ఐఏఎఫ్‌ పాటించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్, ఈ షోకాజ్ నోటీస్‌పై బుధవారం హైకోర్టుకు వివరణ ఇచ్చారు.

సాధారణంగా టీకాకు సంబంధించినంత వరకు అది ఐచ్ఛికమని అన్నారు. అయితే వైమానిక దళానికి సంబంధించినంత వరకు వ్యాక్సినేషన్‌ అన్నది సేవలకు సంబంధించినదిగా మారిందని, సర్వీస్‌లో చేరే సమయంలో తీసుకున్న ప్రమాణంలో కొనసాగింపుగా ఉన్నదని చెప్పారు. ఎయిర్‌ఫోర్స్‌కు హాని కలిగించే స్థితిలో ఉంచకుండా చూడటం అత్యవసరంమని, ఈ నేపథ్యంలో సిబ్బంది తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. నోటీస్‌కు స్పందించిన కార్పొరల్‌ యోగేంద్ర కుమార్, సాయుధ దళాల ట్రిబ్యునల్ చట్టంలోని నిబంధనల ప్రకారం సరైన అధికారి లేదా సాయుధ దళాల ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ చెప్పారు. షోకాజ్‌ నోటీసును రద్దు చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఐఏఎఫ్‌ను ఆదేశించాలని యోగేంద్ర చేసిన అభ్యర్థనలను హైకోర్టు తిరిస్కరించింది.


Next Story