ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ గుజరాత్‌లో రాబోయే ఎన్నికలకు సంబంధించి మూడు అసెంబ్లీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. డిసెంబర్‌లోగా అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్-ఖాదియా నుంచి పోటీ చేస్తారని జుహాపురా ప్రాంతంలో జరిగిన సభలో ఒవైసీ ప్రకటించారు. కౌశిక పర్మార్ అహ్మదాబాద్‌లోని డానిలిమ్డా (ఎస్‌సి) స్థానం నుంచి పోటీ చేయనుండగా, వసీం ఖురేషీ సూరత్-ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు. జమాల్‌పూర్-ఖాదియా, దానిలిమ్డా స్థానాలు ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉండగా, సూరత్-ఈస్ట్ అధికార బీజేపీతో ఉంది.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఢిల్లీలోని మసీదు, మదర్సాను సందర్శించడం బీజేపీ, ఆరెస్సెస్ కొత్త డ్రామా అని ఒవైసీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. "అతను (గుజరాత్ అల్లర్ల బాధితుడు) బిల్కిస్ బానోని కలుసుకుని ఆమెకు న్యాయం చేస్తానని చెప్పగలడా? ఆమెపై అత్యాచారం చేసి అనేక మందిని చంపిన వ్యక్తులను గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. భగవత్ వెళ్లి ఆమెను కలుస్తాడా? లేదు, ఆయన అలా చేయడు" అని ఒవైసీ అన్నారు. భగవత్ ఢిల్లీలోని మదర్సాను సందర్శించగా, అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం మదర్సాలను కూల్చివేస్తోందని అన్నారు అసదుద్దీన్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మదర్సా, వక్ఫ్ ఆస్తులను లాక్కోడానికి సర్వే ప్రారంభించిందని అసదుద్దీన్ అన్నారు.