కంగుతిన్న డాక్టర్లు.. మహిళ కడుపులో 9.2 కిలోల బరువు.. సుదీర్ఘ శస్త్రచికిత్స విజయవంతం..!
అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 49 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ అనే మహిళ కడుపులో ఉన్న 9.8 కిలోల కణితిని ఎయిమ్స్ వైద్యులు తొలగించారు.
By Medi Samrat Published on 12 Dec 2024 9:13 AM ISTఅండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 49 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ అనే మహిళ కడుపులో ఉన్న 9.2 కిలోల కణితిని ఎయిమ్స్ వైద్యులు తొలగించారు. AIIMS క్యాన్సర్ సెంటర్‌లోని సర్జికల్ ఆంకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ MD రే నేతృత్వంలోని వైద్యులు డిసెంబర్ 2న పది గంటల సుదీర్ఘ శస్త్రచికిత్సలో కణితిని తొలగించడంలో విజయం సాధించారు.
ప్రస్తుతం రోగి క్షేమంగా ఉన్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు. ఈ సర్జరీ తర్వాత మహిళ ఆయుష్షు పెరుగుతుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పేషెంట్ కనీసం పదేళ్లపాటు బతికే అవకాశాలు 90 శాతం ఉన్నాయని డాక్టర్ ఎండి రే తెలిపారు. ఆ మహిళ 13 ఏళ్లుగా గ్రాన్యులోసా సెల్ ట్యూమర్ (జిసిటి)తో బాధపడుతోంది.
రెండుసార్లు సర్జరీ, కీమోథెరపీ చేయించుకున్నప్పటికీ మూడోసారి వ్యాధి సోకింది. డిసెంబరు 2011లో ఆ మహిళా రోగి గైనకాలజీ విభాగంలో మొదటిసారిగా శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సమయంలో ఆమెకు మొదటి దశ వ్యాధి వచ్చింది. ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులుగా ఆమె ఫాలోఅప్‌లో ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఆ తర్వాత ఐదేళ్లుగా ఆమె చెకప్ కోసం రాలేదు. దీంతో 2017 సంవత్సరంలో వ్యాధి పునరావృతం అవగా.. ఆమె AIIMS గైనకాలజీ విభాగాన్ని సంప్రదించింది. ఆ తర్వాత రెండోసారి సర్జరీ చేసి కీమోథెరపీ చేశారు. ఆ 18 నెలల ఫాలో-అప్ తర్వాత.. వ్యాధికి సంబంధించిన ఎటువంటి సంకేతాలు లేవు. దీంతో ఆమె మూడు సంవత్సరాల పాటు మళ్లీ చెకప్ కోసం రాలేదు. ఆ తర్వాత ఆమె ఈ ఏడాది అక్టోబర్‌లో సర్జికల్ ఆంకాలజీ విభాగాన్ని సంప్రదించింది. ఈసారి కడుపులో పెద్ద కణితి వచ్చింది. దీని కారణంగా ఆహారం తిన్న తర్వాత నొప్పి, మలబద్ధకం, తరచుగా వాంతులు వంటి సమస్యలతో బాధపడుతుంది.
దీని వల్ల మూడు నెలల్లో 15 కిలోల బరువు తగ్గగా.. హిమోగ్లోబిన్ కూడా డెసి లీటరుకు ఆరు గ్రాములకు తగ్గింది. కణితి కడుపులో గణనీయంగా వ్యాపించింది. మూత్రాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులతో సహా అనేక అవయవాలకు అంటుకుంది. ప్రధాన ధమని, యూరినరీ పైపు, గర్భాశయం సహా అనేక అవయవాలపై ఒత్తిడి ఉంది. కాబట్టి శస్త్రచికిత్స సవాలుగా మారిందని ఐద్యులు తెలిపారు.
మంచి పోషకాహారం కోసం 157 మీటర్ల చిన్న ప్రేగు కలిగి ఉండటం అవసరం. అందువల్ల చిన్న ప్రేగులలో ఎక్కువ భాగాన్ని కత్తిరించడం కుదరదు. ఇతర అవయవాలను కూడా సురక్షితంగా రక్షించాల్సి వచ్చింది. ఇటువంటి రోగులలో కీమోతో పెద్దగా ప్రయోజనం ఉండదు. కీమో 30 నుంచి 40 శాతం మంది రోగులకు మాత్రమే మేలు చేస్తుంది. కాబట్టి శస్త్రచికిత్స మాత్రమే చివరి ఎంపిక.
శస్త్రచికిత్సకు ముందు రోగికి అనేక యూనిట్ల రక్తమార్పిడి జరిగింది. అధిక ప్రోటీన్ ఆహారం ఇవ్వబడింది. చెస్ట్ ఫిజియోథెరపీ, యోగా కూడా చేశారు. తద్వారా శస్త్రచికిత్సకు రోగి శారీరక సామర్థ్యాన్ని పెంచవచ్చు. హిమోగ్లోబిన్ డెసి లీటరుకు తొమ్మిది గ్రాములకు పెరిగిన తర్వాత.. శస్త్రచికిత్స చేసి 9.2 కిలోల బరువున్న కణితిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల తర్వాత రోగి ఐసీయూ నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు.