బీజేపీకి బ్రేకప్ చెప్పిన అన్నాడీఎంకే

తమిళనాడు రాజకీయాలలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  25 Sep 2023 12:45 PM GMT
బీజేపీకి బ్రేకప్ చెప్పిన అన్నాడీఎంకే

తమిళనాడు రాజకీయాలలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీజేపీతో పొత్తు ఉండదని అన్నాడీఎంకే పార్టీ తెలిపింది. తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తును తెంచుకున్నట్లు ప్రకటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం సిఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై చేసిన వ్యాఖ్యల కారణంగా రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. 1956లో మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నాదురై హిందూ మతాన్ని అవమానించారని ఆరోపించారు అన్నామలై. అన్నాదురైని మధురైలో దాచి ఉంచారని, క్షమాపణలు చెప్పడంతో ఆయన తప్పించుకున్నారని అన్నామలై అన్నారు.

ఈ వ్యాఖ్యల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను పదవి నుండి తొలగించాల్సిందేనని అన్నాడీఎంకే డిమాండ్‌ చేసింది. బీజేపీ అధిష్టానం అన్నామలైను పదవి నుండి తప్పించకపోతే మాత్రం తమ రెండు పార్టీల మధ్య పొత్తును పునః సమీక్షించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్నాడీఎంకే - బీజేపీ కూటమిలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్‌షా అన్నా మలైను తప్పించడానికి ఒప్పుకోకపోవడంతో బీజేపీతో విడిపోతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది.

Next Story