కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Ahmed Patel Health Condition Is Serious. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత
By Medi Samrat Published on 15 Nov 2020 12:53 PM GMT
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత అక్టోబర్ మొదటి వారంలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. అయితే.. గత కొంతకాలంగా వరుసగా ఆరోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను గుర్‌గావ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఇతర కీలక అవయవాలపై కూడా ఆ ప్రభావం పడిందని అంటున్నారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా, సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుగా, అత్యంత నమ్మకస్థుడైన నేతగా పేరుంది.
'నాన్నగారి పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ఆయన త్వరగా కోలుకునేలా అంతా ప్రార్ధించాలని కోరుతున్నాను' అని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఓ ట్వీట్ చేస్తూ.. ఈ వార్త ఆందోళన కలిగిస్తోందని, తన మిత్రుడు, కామ్రేడ్ అహ్మద్ పటేల్ త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నానని అన్నారు. పటేల్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.