బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నాయ‌కుల ఇళ్లలో సీబీఐ సోదాలు

Ahead of Bihar floor test CBI raids residence of RJD leaders.బ‌ల ప‌రీక్ష‌కు కొన్ని గంట‌ల ముందే ఆర్జేడీ నేత‌ల ఇళ్ల‌పై సీబీఐ దాడులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2022 11:10 AM IST
బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నాయ‌కుల ఇళ్లలో సీబీఐ సోదాలు

బిహార్ రాష్ట్రంలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మ‌హా గ‌ట్ బంధ‌న్ ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కొవ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. అయితే.. బ‌ల ప‌రీక్ష‌కు కొన్ని గంట‌ల ముందే ఆర్జేడీ సీనియ‌ర్ నేత‌ల ఇళ్ల‌పై సీబీఐ దాడులు జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ బుధ‌వారం ముగ్గురు సీనియ‌ర్ నేత‌ల ఇళ్ల‌లో త‌నిఖీలు చేప‌ట్టింది. కేంద్రంలో యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జ‌రిగిన 'ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌' కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లు అధికారులు చెప్పారు.

పాట్నాలోని ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ నివాసం, ఎంపీ అహ్మద్‌ అష్ఫాఖ్‌ కరీమ్‌, మాజీ ఎమ్మెల్సీ సుబోధ్‌ రాయ్‌ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. దీనిపై సునీల్ సింగ్ స్పందిస్తూ.. ఇప్ప‌టికే ఓ సారి త‌నిఖీలు చేశారు. మ‌ళ్లీ చేయ‌డంలో అర్థం లేదు. కావాల‌ని భ‌య‌భ్రాంతుల‌ను సృష్టించి ఎమ్మెల్యేను వారికి అనుకూలంగా మార్చుకోల‌ని భావిస్తున్నార‌న్నారు.

కాగా.. దాడుల‌పై ఆర్జేడీ ఎంపీ మ‌నోజు ఝా మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు బీజేపీ చేయించే దాడులు అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అవ‌న్ని బీజేపీ కింద‌నే ప‌నిచేస్తాయ‌న్నారు. వారి ఆఫీసుల‌ను కూడా ఆ ప‌ర్టీ స్క్రిప్టే న‌డిస్తుంద‌న్నారు. "ఈ రోజు బిహార్ అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష ఉంది. అదే స‌మ‌యంలో ఇక్క‌డేం జ‌రుగుతుందో అర్థం చేసుకోవ‌చ్చున‌ని " తెలిపారు.

Next Story