మొన్న కన్నడ భాష.. ఇప్పుడు కర్ణాటక జెండాపై..
After Google, Amazon receives flak from Kannadigas for selling bikini with Karnataka flag. రెండు రోజుల కిందే 'కన్నడ భాష' గురించి తీవ్రమైన చర్చ
By Medi Samrat Published on 6 Jun 2021 2:44 PM IST
రెండు రోజుల కిందే 'కన్నడ భాష' గురించి తీవ్రమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే..! గూగుల్ లో 'అగ్లీయెస్ట్ లాంగ్వేజ్' అంటే ఏమిటి అని అడగ్గా.. 'కన్నడ' అని చూపించింది. ఇక ఈ సమాధానం కన్నడిగులకు తీవ్ర కోపం తెప్పించడంతో పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో గూగుల్ పై విమర్శలు మొదలుపెట్టారు. భారతదేశంలో వికారమైన భాష ఏమిటి? అనే ప్రశ్నకు గూగుల్ సమాధానం కన్నడ అని ఉంది. దక్షిణ భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది మాట్లాడే భాష కన్నడ. దీనిపై కన్నడ ప్రజలు, రాజకీయ ప్రతినిధులు మండిపడ్డారు. జరిగిన తప్పిదానికి, కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు గూగుల్ క్షమాపణలు తెలియజేసింది.
అదే సమయంలో నిజానికి ఈ అభిప్రాయాలు గూగుల్‌కు సంబంధం లేనివి అని వివరణ ఇచ్చింది. 'సెర్చ్ రిజల్ట్స్ ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండవు. కొన్నిసార్లు, కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలకు ఇంటర్నెట్‌లో ఆ కంటెంట్ వివరించబడిన విధానం ఆశ్చర్యకర రీతిలో ఉంటుందని' గూగుల్ తెలిపింది. ఇది సరైనది కాదని మాకు తెలుసు.. అందుకే సమస్య గురించి తెలియగానే దిద్దుబాటు చర్యలకు దిగుతామని.. సంబంధిత అల్గారిథంను మెరుగుపరిచేందుకు నిరంతరం పనిచేస్తుంటామని గూగుల్ వివరించింది. నిజానికి సెర్చ్ రిజల్ట్స్‌లో చూపించే కంటెంట్ గూగుల్ అభిప్రాయం కిందకు రాదని.. ఏదేమైనా జరిగిన అపార్థానికి,ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నామని గూగుల్ తెలిపింది.
ఇప్పుడు కర్ణాటక జెండా గురించి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పెద్ద తప్పే చేసింది. అమెజాన్ కెనడా.. కన్నడ రాష్ట్ర జెండాతో ముద్రించిన బికినీని అమ్మకానికి పెట్టింది. దీనిని కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబాలి చూశారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని అమెజాన్‌ను ఆయన డిమాండ్ చేశారు. ఇది కన్నడిగుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఇలాంటివాటిని తాము సహించబోమని అన్నారు.