కర్నాటకలో కాంగ్రెస్ విజయం వెనక ఉన్న వ్యూహకర్తకు మరో పెద్ద బాధ్యత..!
After delivering Karnataka, Congress’ strategist Sunil Kanugolu to look for victory in Madhya Pradesh. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వచ్చింది. 224 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆ పార్టీ 135 సీట్లు గెలుచుకోగా
By Medi Samrat
Sunil Kanugolu
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వచ్చింది. 224 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆ పార్టీ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కర్ణాటక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సునీల్ కానుగోలు వ్యూహం సిద్ధం చేసినట్లు సమాచారం. కర్నాటకలో చారిత్రాత్మక విజయం నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌లో కూడా అలాంటి ఫలితాలు తెచ్చే బాధ్యతను సునీల్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో సునీల్ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించుకునేందుకు బలమైన వ్యూహాలను సిద్ధం చేయనున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన జ్యోతిరాధిత్యా సింధియా తిరుగుబాటు కారణంగా 2020లో పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే ఉంది. కాంగ్రెస్ సీనియర్లు, మాజీ ముఖ్యమంత్రులు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో కేంద్రం, రాష్ట్రంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ డబుల్ ఇంజన్ సర్కార్‌ను కార్నర్ చేయడానికి కర్ణాటక తరహా ప్రచారాన్ని సిద్ధం చేయాలని సునీల్ కనుగోలును కాంగ్రెస్ అధిస్టానం కోరినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందేందుకు పార్టీ సీనియర్లు జేపీ అగర్వాల్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ అందరూ అట్టడుగు సమస్యలపై కసరత్తు చేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కోటను కాపాడుతుండగా, కమలనాథ్ జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అంతర్గత పోరు, ఇతర సమస్యలతో పోరాడుతోందని, అందుకే సునీల్ కానుగోలుకు వాటితో పోరాడే బాధ్యతను అప్పగించినట్లు పార్టీ నాయకుడు చెప్పారు.
శాంతిభద్రతలు, ప్రభుత్వ పథకాల వైఫల్యం, అవినీతి ఆరోపణలపై రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తించే బాధ్యతను సునీల్ కానుగోలుకు అప్పగించారు. సునీల్ కానుగోలు గత విజయాల నేపథ్యంలో ఆయన మార్గనిర్దేశనంలో ప్రచారం, సర్వేలు నిర్వహించడం ద్వారా మధ్యప్రదేశ్‌లో మరోసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది.
గత ఏడాది మే నుంచి సునీల్ కానుగోలును కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ రావడం వెనుక సర్వేలు, ప్రచారం, అభ్యర్థుల ఖరారు, విజయానికి వ్యూహరచన చేయడంలో సునీల్ కీలకపాత్ర పోషించారు.
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో కూడా సునీల్ కానుగోలు కీలక పాత్ర పోషించారు. గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి యాత్రను ప్రారంభించారు. ఎక్కువగా తెరవెనుక ఉండిపోయిన సనీల్ కానుగోలు దక్షిణాదిలోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి వ్యూహరచన చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
కర్నాటక పోటీ త్రిముఖంగా మారకుండా బీజేపీ, జేడీ(ఎస్)లను కార్నర్ చేసి కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేయాలన్నది సునీల్ వ్యూహం. రేట్ కార్డులు, పే-సీఎంలు, ప్రభుత్వంలో 40 శాతం కమీషన్, ప్రియాంక గాంధీ వాద్రా మోదీని లక్ష్యంగా చేసుకుని 'క్రై పీఎం' ప్రచారం వంటి అంశాలపై.. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన ప్రచారాలకు సునీల్ కానుగోలు కారణమని పార్టీ నాయకులు అంటున్నారు.