అక్కడ పెరుగుతున్న కరోనా మహమ్మారి.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
After Covid surge in South East Asia, Centre sends warning note to states. ఆగ్నేయాసియా దేశాల్లో కరోనావైరస్ కేసుల విజృంభణ కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం
By Medi Samrat
ఆగ్నేయాసియా దేశాల్లో కరోనావైరస్ కేసుల విజృంభణ కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో ఫోర్త్ వేవ్ రాకుండా నిఘాని ఉంచాలని కోరుతూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం లేఖలు రాసింది. కరోనా వైరస్ ను తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేసింది. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని, కరోనా మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, కరోనా నియమావళి, వ్యాక్సినేషన్ విధానంలో ఐదు అంచెల వ్యూహాన్ని మళ్లీ అమలు చేయాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటికీ, ప్రపంచదేశాలు మళ్లీ సతమతమవుతుండడంతో తాజా హెచ్చరికలు చేసింది.
చైనాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండగా, దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షలకు పైగా కేసులు, 400కి పైగా మరణాలు సంభవించాయి. భారతదేశంలో తక్కువగా రోజువారీ కేసుల సంఖ్య నమోదవుతున్నా చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియాతో సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఓమిక్రాన్ 'స్టెల్త్' సబ్-వేరియంట్ వ్యాప్తి కారణంగా ఇన్‌ఫెక్షన్లు కొంతవరకు పెరిగాయి. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ ప్రోటోకాల్‌లపై అవగాహనతో నడుచుకోవాలని, ప్రోటోకాల్ నియమాలను పాటించేలా చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో తెలిపారు.
భారతదేశంలో గత 24 గంటల్లో 2,528 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,997 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 149 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 29,181కి చేరాయి. పాజిటివిటీ రేటు 0.40 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,24,58,543 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 5,16,281కి చేరింది. రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది.






