వ్యభిచారం, స్వలింగ సంపర్కం నేరరహితం కావు..సుప్రీంకోర్టులో కేంద్రం సంచలన వాదనలు
శబరిమల ఆలయ ప్రవేశం వంటి మతపరమైన అంశాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన వాదనలు వినిపించింది.
By - Knakam Karthik |
వ్యభిచారం, స్వలింగ సంపర్కం నేరరహితం కావు..సుప్రీంకోర్టులో కేంద్రం సంచలన వాదనలు
ఢిల్లీ: శబరిమల ఆలయ ప్రవేశం వంటి మతపరమైన అంశాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన వాదనలు వినిపించింది. గతంలో వ్యభిచారాన్ని (సెక్షన్ 497), స్వలింగ సంపర్కాన్ని (సెక్షన్ 377) నేరరహితం చేస్తూ ఇచ్చిన తీర్పులు సరైనవి కావని, అవి "మంచి చట్టాలు" కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ తీర్పులన్నీ "రాజ్యాంగ నైతికత" (Constitutional Morality) అనే అంశాన్ని వ్యక్తిగత కోణంలో అన్వయించి ఇచ్చినవే తప్ప, పటిష్టమైన చట్టబద్ధమైన పునాది లేనివని కేంద్రం అభిప్రాయపడింది.
ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఉంటుందని, చట్టాలను రూపొందించేది మెజారిటీయేనని మెహతా గుర్తుచేశారు. రాజ్యాంగ నైతికత అనేది ఒక భావోద్వేగం మాత్రమేనని, దాని ఆధారంగా ఒక చట్టాన్ని పరీక్షించడం లేదా రద్దు చేయడం అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధమని వాదించారు. సుప్రీంకోర్టు తన తీర్పుల్లో విదేశీ జర్నల్స్, పౌడ్‌కాస్ట్‌లు మరియు వివాదాస్పద సిద్ధాంతకర్తల వ్యక్తిగత అభిప్రాయాలను కోట్ చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికన్ స్కాలర్ జెఫ్రీ సెగల్, జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదిత మీనన్ వంటి వారి అభిప్రాయాలు 140 కోట్ల మంది భారతీయులకు వర్తించే చట్టాల్లో భాగం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ విచారణలో రాజ్యాంగంలోని అధికరణలు 25, 26 ప్రకారం 'నైతికత' అనే పదానికి ఉన్న పరిధిని, న్యాయ సమీక్షా అధికారాలను చర్చిస్తోంది. కేవలం వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా నైతికతను నిర్వచించడం తగదని, జోసెఫ్ షైన్ కేసులో ఇచ్చిన తీర్పు సమాజ నైతికతకే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి కూడా వ్యతిరేకమని కేంద్రం తన లిఖితపూర్వక వాదనల్లో స్పష్టం చేసింది. మత స్వేచ్ఛ మరియు ప్రాథమిక హక్కుల మధ్య ఉన్న సమతుల్యతపై ఈ తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తుది నిర్ణయం తీసుకోనుంది.