'నా భర్తను క్రిమినల్‌లా ట్రీట్ చేస్తున్నారు..'

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఆయన భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా ఖండించారు.

By -  Medi Samrat
Published on : 27 Sept 2025 10:02 AM IST

నా భర్తను క్రిమినల్‌లా ట్రీట్ చేస్తున్నారు..

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను ఆయన భార్య గీతాంజలి అంగ్మో తీవ్రంగా ఖండించారు. ఎలాంటి కారణం లేకుండా తన భర్తను నేరస్థుడిలా ట్రీట్ చేస్తోంద‌ని ఆంగ్మో ఆరోపించింది. నా భర్త ప్రతిష్టను దిగజార్చేలా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆంగ్మో అన్నారు. ఇదీ అత్యంత నీచమైన ప్రజాస్వామ్యం.. కారణం లేకుండా కేవలం నేరస్తుడిలా అరెస్టు చేసి తీసుకెళ్లారు.. పోలీసులు సోదాలు చేసే నెపంతో మా ఇంటిని కూడా ధ్వంసం చేశారని వాపోయారు. నా భర్తను దేశ వ్యతిరేకి అంటున్నారు. ఆయ‌న ఎన్నో అవార్డులు అందుకొని దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారన్నారు. ఆంగ్మో సోనమ్ సంస్థ, హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్ (HIAL)కి సహ వ్యవస్థాపకురాలు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చలకు సంబంధించి లేహ్ అపెక్స్ బాడీ (LAB) కో-కన్వీనర్ త్సెరింగ్ డోర్జే శుక్రవారం మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ చర్చలకు అనుకూలంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వమే చర్చల నుంచి వెనక్కి తగ్గుతోంది. అందుకే ఇక్కడ నిరాహారదీక్షకు కూర్చోవలసి వచ్చింది. హింసాకాండలో పోలీసు కాల్పుల్లో మరణించిన వారి అంత్యక్రియలు సెప్టెంబర్ 28-29 తేదీల్లో జరగనున్నాయి. ఆ తర్వాతే ఢిల్లీ వెళ్లే విషయంలో ఎలాంటి నిర్ణయ‌మైనా తీసుకుంటామ‌న్నారు. మా ఉద్యమంలో విదేశీ హస్తం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డోర్జే లేహ్‌లో విలేకరులతో అన్నారు. మా ఉద్యమం స్థానికం అని స్ప‌ష్టం చేశారు.

ఎలాంటి హెచ్చరికలు లేకుండానే భద్రతా బలగాలు నిర‌స‌న జ‌రుపుతున్న వారిపై కాల్పులు జరిపాయని అన్నారు. గాయపడిన వారిలో 95 శాతం మంది బుల్లెట్లు లేదా పెల్లెట్ల వల్ల గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న దోడా, నేపాల్, బీహార్, టిబెట్ ప్రజలు కూడా గాయపడ్డారు. వారి ప్రాతిపదికన ఆ ప్ర‌జ‌లు ఉద్యమంలో పాల్గొన్నారని.. హింసను వ్యాప్తి చేశారని.. అది తప్పు.. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అదే చెప్పారన్నారు. విదేశీ హస్తం ఉంటే.. విదేశీ నిధులు ఉంటే.. మన నిఘా సంస్థలు ఏమి చేస్తున్నాయని ప్ర‌శ్నించారు. ఇది మా ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని దాచడానికి ఒక సాకు అని అన్నారు.

Next Story