కేజ్రీవాల్ దూకుడు.. షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల తొలి జాబితా విడుదల
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు ముమ్మరం చేసింది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 9:00 AM GMT2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆప్ గురువారం రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే వచ్చే సంవత్సరం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితాలో కాంగ్రెస్, బీజేపీలను వీడి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చింది. 11 స్థానాలకు గానూ ఆరింటికి ఇతర పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. అనిల్ ఝా, బీబీ త్యాగి, బ్రహ్మ్ సింగ్ తన్వర్ కొద్ది రోజుల క్రితం బీజేపీ నుంచి ఆప్‌లో చేరారు. జుబేర్ చౌదరి, వీర్ సింగ్ ధింగన్, సుమేష్ షౌకీన్ కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరారు. బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు టిక్కెట్లు దక్కించుకున్నారు.
తొలి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లు
బ్రహ్మ సింగ్ తన్వర్-ఛతర్‌పూర్
అనిల్ ఝా - కిరారీ
దీపక్ సింగ్లా - విశ్వాస్ నగర్
సరితా సింగ్ - రోహ్తాస్ నగర్
లక్ష్మీ నగర్ - బీబీ త్యాగి
రామ్ సింగ్ నేతాజీ - బదర్‌పూర్
జుబేర్ చౌదరి - సీలంపూర్
వీర్ సింగ్ ధింగన్ - సీమాపురి
గౌరవ్ శర్మ - ఘోండా
మనోజ్ త్యాగి - కరావాల్ నగర్
సుమేష్ షౌకీన్ - మటియాలా
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో సీఎం అతిషి కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరుగుతున్న పీఏసీ సమావేశం కారణంగా ఫిరోజ్‌షా రోడ్డును మూసివేశారు.
ఇదిలావుంటే.. ఢిల్లీ 7వ అసెంబ్లీ పదవీకాలం 15 ఫిబ్రవరి 2025న ముగియనుంది. అంటే జనవరి నెలాఖరు లేదా పిబ్రవరి ప్రథమ వారంలో ఎన్నికలు జరుగనున్నాయి.