చంద్రగ్రహణం తర్వాత నుంచి.. ఆ ఇంట్లో ప్రతి రోజూ మంటలు.. అంతుచిక్కని ఘటన
A house in Uttarakhand has been on fire every day since the day after the lunar eclipse. ఇటీవల చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత రోజు నుంచి ఓ ఇంట్లో ప్రతి రోజూ మంటలు చెలరేగుతున్నాయి.
By అంజి Published on 18 Nov 2022 10:13 AM ISTఇటీవల చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత రోజు నుంచి ఓ ఇంట్లో ప్రతి రోజూ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయితే మంటలు ఎలా చెలరేగుతున్నాయనేది అంతు చిక్కడం లేదు. ఈ మిస్టరీ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. నైనిటాల్ జిల్లా హల్ద్వానీలోని ఓ ఇంట్లో చెలరేగుతున్న మంటల ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 8 రోజులుగా రాత్రికి రాత్రే ఇంట్లో మంటలు చెలరేగుతుండటంతో ఇంట్లోని ప్రజలతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల చంద్రగ్రహణం ఏర్పడిన నాటి నుంచి ఇలా జరుగుతోందని, దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు. నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాతి రోజే నేపాల్‌లో భూకంపం వచ్చింది. దీని ప్రభావం చాలా ఉత్తరాది రాష్ట్రాలపై పడింది. అందులో ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఉంది. ఈ రెండు ఘటనల సంభవించిన తర్వాత ఆ ఇంట్లో రాత్రిపూట మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఎప్పుడ ఏం జరుగుతుందో తెలియక ఇంటి సభ్యులు నిద్ర కూడా సరిగా పోవడం లేదు.
ఉన్నట్టుండి మంటలు చెలరేగుతుండటంతో.. విద్యుత్ అధికారులను పిలిపించి కరెంట్ సరఫరాను తీసివేశారు. అయినా విద్యుత్ బోర్డులు, వైర్లు కాలిపోతున్నాయి. 8 రోజుల్లో 20 అగ్నిప్రమాదాలు జరిగాయని, వాటి కారణంగా అల్మారాలో ఉంచిన దుస్తులు కూడా కాలిపోయాయని కుటుంబ సభ్యులు చెప్పారు. కరెంట్ లేకున్నా.. ఆ ఇంట్లోని కూలర్‌లో తరచూ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వస్తున్నాయి. దీంతో విద్యుత్ అధికారులు ఇంట్లో ఎర్తింగ్ ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇంకా మంటలు వస్తూనే ఉన్నాయి.
చంద్రగ్రహణం సమయంలో ఏదో మార్పు వచ్చిందని.. అందుకే ఇలా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. మరికొందరు భూకంపం వల్ల మార్పు వచ్చిందని అంటున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదాలకు కారణం మాత్రం దొరకడం లేదు. స్థానికులు ఆ ఇంటికి వచ్చి మంటలను చూసి ఆశ్చర్యపోతున్నారు. కాలిన వస్తువులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన సిటీ మేజిస్ట్రేట్ రిచా సింగ్ పోలీసులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.