2013లో బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నాలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ఎన్‌ఐఐ స్పెషల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను విధిస్తూ జాతీయ దర్యాప్తు కోర్టు తీర్పు చెప్పింది. వరుస పేలుళ్ల కేసులో 9 మంది దోషులుగా ఉన్నారు. ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష, మరో ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష, మరో ఇద్దరికి జీవితఖైదు శిక్షను విధించింది. ఈ కేసును విచారించిన స్పెషల్ కోర్టు అక్టోబర్ 27వ తేదీనే 9 మందిని దోషులుగా ప్రకటించింది. ఇంతియాజ్ ఆలం, మహ్మద్ ముజీబుల్లా అన్సారీ, నొమాన్ అన్సారీ, హైదర్ అలీ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన దోషులుగా ఉన్నారు.
2013లో భారతీయ జనతా పార్టీ అప్పటి ప్రధాని అభ్యర్థిగా.. అప్పుడు గుజరాత్ సీఎంగా పని చేస్తున్న నరేంద్ర మోడీని ప్రకటించింది. ఈ సందర్భంగా పాట్నాలోని గాంధీ గ్రౌండ్‌లో హుంకార్ పేరుతో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. అయితే అప్పటికి మోడీ సభా వేదిక వద్దకు చేరుకోలేదు. సభా వేదిక నుండి 150 మీటర్ల దూరంలో రెండు బాంబులు పేలాయి. ఈ ర్యాలీలో 6 బాంబులు వరుసగా పేలాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 70 మందికిపైగా గాయాలయ్యాయి.