హిమాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కొండచరియలు విరగడంతో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు నదిలో పడ్డాయి. ఈ ఘటనలో పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. బండరాళ్లు పడటంతో వంతెనతో పాటు వసతి గదులు కూలిపోయాయి. పర్యాటక ప్రదేశమైన చిట్కుల్‌కు వెళ్తున్న సమయంలో పర్యాటకుల వాహనంపై బండరాళ్లు పడటంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 2.15గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనపై చీఫ్ సెక్రెటరీ అనిల్ ఖాదీ మాట్లాడుతూ.. ఘటనలో తొమ్మిది మంది మరణించారని తెలిపారు. డెప్యూటీ కమిషన్ అబిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. మృతదేహాలను గుర్తించేందుకు, గాయపడిన వారికి అవసరమైన సహాయక సహకారాలు అందించేందుకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సీనియర్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.