అమెరికా ప్రమాదకర నేరస్థుల జాబితాలో 89 మంది భారతీయులు..!
అక్రమ వలసలు, నేరాలపై కఠిన చర్యలను తీవ్రతరం చేస్తూ అమెరికా 89 మంది భారతీయ పౌరులను అత్యంత చెత్త(Worst of the Worst) జాబితాలో చేర్చింది.
By - Medi Samrat |
అమెరికా ప్రమాదకర నేరస్థుల జాబితాలో 89 మంది భారతీయులు
అక్రమ వలసలు, నేరాలపై కఠిన చర్యలను తీవ్రతరం చేస్తూ అమెరికా 89 మంది భారతీయ పౌరులను అత్యంత చెత్త(Worst of the Worst) జాబితాలో చేర్చింది. ఈ జాబితాను US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త పబ్లిక్ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇది తీవ్రమైన నేరాలకు పాల్పడిన అక్రమ వలసదారుల వివరాలను అందిస్తుంది.
ఈ వెబ్‌సైట్‌లో నేరస్థుల పేర్లు, ఛాయాచిత్రాలు, జాతీయత, వారు చేసిన నేరాల గురించిన సమాచారం బహిరంగంగా వెల్లడించింది. ఏఏ నేరస్థులను, అక్రమ వలసదారులను అరెస్టు చేసి, వారి కమ్యూనిటీల నుండి తొలగించారో అమెరికన్ పౌరులకు చూపించడమే ఈ చర్య లక్ష్యమని ఆ విభాగం చెబుతోంది.
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అరెస్టు చేసిన అత్యంత తీవ్రమైన నేరస్థులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెబ్‌సైట్ ప్రారంభ సందేశం పేర్కొంది. ఇందులో, హత్య, లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింసాత్మక నేరాలలో పాల్గొన్న వ్యక్తులను ముందుగా జాబితా చేస్తారు.
DHS ఈ వెబ్‌సైట్ గురించిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కూడా పంచుకుంది. ఇప్పుడు సాధారణ ప్రజలు.. ఏ నేరస్థులను పట్టుకున్నారో, వారు ఏ నేరాలకు పాల్పడ్డారో, వారు ఏ ప్రాంతాల నుండి తొలగించబడ్డారో స్వయంగా చూడగలరని పేర్కొంది.
జాబితాలో ఉన్న 89 మంది భారతీయులు లైంగిక నేరాలు, అత్యాచారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దొంగతనం, DUI (మద్యం తాగి వాహనం నడపడం), హిట్ అండ్ రన్, స్మగ్లింగ్, మోసం, దోపిడీ, దాడి, కిడ్నాప్, మనీలాండరింగ్, గృహ హింస, హత్య వంటి తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అన్ని పేర్లూ యునైటెడ్ స్టేట్స్‌లో అరెస్టు చేయబడి దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులవే. ఈ వెబ్‌సైట్ సెర్చ్ ఫిల్టర్‌లను కూడా కలిగి ఉంది. వినియోగదారులు పేరు, దేశం లేదా రాష్ట్రం ఆధారంగా సమాచారం కోసం శోధించడానికి వీలు కల్పిస్తుంది.