బీహార్‌లో 11 సార్లు కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వృద్ధుడి గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. అలా ఎలా వేయించుకున్నావయ్యా అని అందరూ అవాక్కవ్వడమే కాకుండా.. అధికారులను ఎలా బురిడీ కొట్టించావయ్యా అని కూడా ప్రశ్నించారు. బీహార్‌లోని మాధేపురా జిల్లాలోని పురైని ప్రాంతానికి చెందిన 84 ఏళ్ల బ్రహ్మదేవ్ మండల్, 11 డోస్‌ల కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని అధికారులు, పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో పురైనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బ్రహ్మదేవ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (పిహెచ్‌సి) విభాగం బ్రహ్మదేవ్ మండల్‌పై ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 84 వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్ తాను 11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాని తెలిపాడు. 2021, ఫిబ్రవరి 13న తాను మొదటి డోసు తీకున్నానని, డిసెంబర్ వరకు 11 డోసులు వేయించుకున్నానని చెప్పాడు. 12వ డోసు తీసుకునేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లానని.. అక్కడ టీకాల కార్యక్రమం ముగిసిందని విచారం వ్యక్తంచేశారు. 11 డోసులు తీసుకున్నప్పటికీ తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని తెలిపారు. తాను ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నానో రాసి పెట్టికున్నానని చెప్పారు.