మండుతున్న ఎండలు.. పెరుగుతున్న అగ్నిప్రమాదాలు.. ఆరు రోజుల్లో కంట్రోల్ రూమ్‌కు 824 కాల్స్
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాజధానిలో అగ్ని ప్రమాదాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి.
By Medi Samrat
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో దేశ రాజధానిలో అగ్ని ప్రమాదాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ఏప్రిల్ మొదటి ఆరు రోజుల డేటాను పరిశీలిస్తే.. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) కంట్రోల్ రూమ్‌కు 824 కాల్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికార యంత్రాగం అలర్ట్ మోడ్‌లోకి వచ్చింది.
హడావుడిగా అగ్నిమాపక శాఖలోని అధికారులు, ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సిబ్బంది అంతా 24 గంటలూ అలర్ట్ మోడ్‌లో ఉండాలని కోరారు. అగ్నిమాపక శాఖ అన్ని కార్యాలయాలు.. పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రాంతాలను సందర్శించి అగ్నిమాపక భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిప్యూటీ ఫైర్ చీఫ్ సంజయ్ కుమార్ తోమర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వేసవి వచ్చిందంటే అకస్మాత్తుగా మంటలు చెలరేగడం గమనించవచ్చు. అటువంటి పరిస్థితిలో అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి.. అగ్నిప్రమాదాల విషయంలో వీలైనంత త్వరగా సహాయం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
అగ్నిమాపక శాఖ వద్ద చిన్నా పెద్దా కలిపి దాదాపు 300 వాహనాలు ఉండగా.. వీటిలో చాలా వరకు బ్రేక్‌డౌన్‌ల కారణంగా సేవలు అందడం లేదు. వెంటనే మరమ్మతులు చేసి సేవల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. అంతే కాకుండా వర్క్‌షాప్‌లో 24 గంటలూ పనిచేయాలని, ఏదైనా కారణం వల్ల ఏదైనా వాహనం చెడిపోతే రాత్రిపూట కూడా మరమ్మతులు చేసేలా సిబ్బందిని కోరారు.
ప్రతి కాల్‌కు ప్రతిస్పందన సమయాన్ని తగ్గించాలని కంట్రోల్ రూమ్‌కు సూచించబడింది. వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 6 వరకు డేటాను పరిశీలిస్తే, DFSకి మొత్తం 4647 కాల్స్ వచ్చాయి. ఇందులో మంటల్లో కాలిపోయి 20 మంది చనిపోయారు.