అంత్యక్రియలకు ముందు కళ్లు తెరిచిన బామ్మ
76-year-old Covid positive woman wakes up minutes before cremation. కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను కనీ కనిపించకుండా తీస్తోంది
By Medi Samrat Published on 15 May 2021 4:53 PM IST
కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను కనీ కనిపించకుండా తీస్తోంది. అయితే కొన్ని కేసులు అందరినీ ఆశ్చర్య పెడుతున్నాయి. కొన్ని చోట్ల మరీ చిన్న పిల్లలు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే, మరికొన్ని చోట్ల ముసలివాళ్లు అయినా సరే వైద్యానికి స్పందించి కరోనాతో పోరాడి ప్రాణాలు కాపాడుకుంటున్నారు.
మహారాష్ట్రలో ఇలాంటి సంఘటన జరిగింది. బారామతి అనే గ్రామంలో కరోనా సోకిన 76 ఏళ్ల వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకు వచ్చారు. దేశంలోని చాలా ప్రాంతాల్లోని హాస్పిటల్స్ లాగే అక్కడ కూడా ఆమె కి బెడ్డు దొరకలేదు. ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అంటూ పలు ఆసుపత్రుల చుట్టూ అంబులెన్సు తిరుగుతూ ఉండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ముసలావిడ లేవక పోవడంతో కుటుంబసభ్యులు ఆమె మృతి చెందిందని భావించారు. ఇంటికి తీసుకెళ్లి పోయి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా రోగి కావడం తో ఒక్కరు కూడా ఆమె దగ్గరకు వెళ్లి చూడకపోయినప్పటికీ, బిగ్గరగా ఏడుస్తూ చివరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కుటుంబ సభ్యుల ఏడుపులే కదిలించాయో, పోయిన ఊపిరే తిరిగి వచ్చిందో కానీ సరిగ్గా అదే టైంలో బామ్మ కళ్ళు తెరిచింది. వెంటనే ఏదో క్రైమ్ సినిమా చూసినట్టు కుటుంబ సభ్యులు అందరూ అదిరిపడిపోయారు. మళ్ళీ ఒక క్షణంలో తేరుకొని మరోసారి ఆసుపత్రికి బయలుదేరారు. చివరికి ఎలాగోలా గ్రామ ఆరోగ్య అధికారి సహాయంతో బామ్మకు వైద్యం అందేలా చేశారు. ప్రస్తుతం ఆవిడ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కుటుంబం కు సంబంధించిన వివరాలు బయట పెట్టవద్దని వృద్దురాలి బంధువులు కోరినట్టుగా తెలుస్తోంది.