ఏడుగురు చిన్నారులు మృతి.. కారణం శీత‌ల‌ పానీయమా.. వైరల్ ఇన్‌ఫెక్షనా..?

7 children die of ‘mysterious illness’ in Sirohi village. రాజస్థాన్‌లోని సిరోహి గ్రామంలో గురువారం నాడు స్థానికంగా తయారు చేసిన పానీయాలు సేవించి

By Medi Samrat  Published on  15 April 2022 3:51 PM IST
ఏడుగురు చిన్నారులు మృతి.. కారణం శీత‌ల‌ పానీయమా.. వైరల్ ఇన్‌ఫెక్షనా..?

రాజస్థాన్‌లోని సిరోహి గ్రామంలో గురువారం నాడు స్థానికంగా తయారు చేసిన పానీయాలు సేవించి ఏడుగురు చిన్నారులు మరణించారు. ఎవరూ చూడని, ఎవరూ ఊహించని అనారోగ్యంతో ఆ పిల్లలు మరణించారు. రాష్ట్రస్థాయి వైద్యులతో కూడిన వైద్యబృందం ఘటనాస్థలికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లల కుటుంబాలను అడిగిన వైద్య అధికారులు, పిల్లలు గత రాత్రి ప్లాస్టిక్ పైపులలో స్థానిక విక్రేతలు విక్రయించిన ప్యాక్ చేసిన ఐస్‌డ్ డ్రింక్స్ తాగినట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం వారు అనారోగ్యంతో బాధపడటం ప్రారంభించారు.

చిన్నారుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ పానీయాలు తాగడమే మృతికి కారణమని తెలుస్తోంది. వైద్య బృందం గ్రామంలోని వివిధ దుకాణాల నుండి ఈ పానీయాల నమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి వాటి అమ్మకాలను నిలిపివేయాలని కోరారు.

ఈ ఘటనపై రాజస్థాన్ ఆరోగ్య మంత్రి ప్రసాది లాల్ మీనా స్పందించారు. ఈ కేసుల వైద్య పరిశోధనలో శీతల పానీయాలు తాగడం వల్ల కాకుండా వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల మరణాలు సంభవించాయని తేలిందని చెప్పారు. ''కలెక్టర్‌తో మాట్లాడాను. ఏడుగురు చిన్నారులు చనిపోయారు. వైరల్ కారణంగా ఈ మరణాలు సంభవించాయి. గ్రామంలో సర్వే చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. జైపూర్, జోధ్‌పూర్ నుండి బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి" అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. పిల్లల మరణానికి కారణం వైరల్ ఇన్ఫెక్షన్ అని అన్నారు. "అక్కడ కుటుంబాలను, గ్రామస్థులను సఅడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. మేము గ్రామంలో శాశ్వత బృందాన్ని ఉంచాము "అని ప్రసాది లాల్ మీనా చెప్పారు.













Next Story