ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే..! ఊహించని విధంగా ఆగిపోవడం.. రివర్స్ మోడ్ సరిగా పనిచేయకపోవడం.. ఇలా ఒకటా రెండా ఎన్నో సమస్యలు సదరు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ 'రివర్స్ మోడ్' కారణంగా జోధ్‌పూర్‌లో 65 ఏళ్ల వ్యక్తి.. తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓలా ఇ-స్కూటర్ ఊహించని విధంగా పూర్తి వేగంతో రివర్స్ మోడ్‌లోకి వెళ్లడంతో ఆ వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. బాధితుడి కుమారుడైన పల్లవ్ మహేశ్వరి, గత సంవత్సరం భారతదేశానికి వచ్చాడు. దేశంలోని EV విప్లవం గురించి తెలుసుకుని ఓలా బైక్ తీసిచ్చారు.
అయితే ఇప్పుడు ఆ వెహికల్ కారణంగా అతడి తండ్రి గాయపడ్డాడని తెలిపాడు. ఈ సంఘటనలో తన తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి అని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. పూర్తి వేగంతో రివర్స్ మోడ్‌లో వెళ్లడంతో ఓలాఎలక్ట్రిక్ స్కూటర్ కారణంగా మా నాన్నను తీవ్రంగా గాయపరిచింది. తన తండ్రి 65 ఏళ్ల వయస్సులో కూడా చాలా చురుకుగా ఉండేవాడు.. #ఓలా #ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉపయోగించడానికి ఉత్సాహంగా ఉండేవాడు.. అయితే ఆ బైక్ కారణంగా తన తండ్రి పరిస్థితి మారిపోయింది" అని మహేశ్వరి తన తండ్రికి సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేశారు. తన తండ్రికి తలపై 10 కుట్లు పడ్డాయని.. ఎడమ చేయి విరిగిందని చెప్పుకొచ్చారు. ఈ కొత్త సంఘటనను ఓలా ఎలక్ట్రిక్ ఇంకా ప్రస్తావించలేదు. గతంలో చాలా మంది ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు రివర్స్ మోడ్ యాక్సిలరేటర్ లోపం గురించి ఫిర్యాదు చేశారు.