శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌ను 6.1 తీవ్రతతో భూకంపం తాకింది. దీంతో బీహార్, సిలిగురి, భారతదేశంలోని ఇతర పొరుగు ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రకపంనలతో ఇళ్ళు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఖాట్మండుకు తూర్పున 65 కి.మీ దూరంలో ఉన్న సింధుపాల్‌చౌక్ జిల్లాలోని భైరవ్‌కుండలో భూకంప కేంద్రం ఉందని జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం నిర్ధారించింది.
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:51 గంటలకు భూకంపం సంభవించింది. నేపాల్ మధ్య, తూర్పు ప్రాంతాలలో భూకంప భయాందోళనలు చెలరేగాయి. శుక్రవారం భూకంపం ప్రభావాన్ని ఇంకా అంచనా వేయడం జరుగుతోందని, ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. పాట్నా, సిక్కిం, డార్జిలింగ్‌లలో భవనాలు, సీలింగ్ ఫ్యాన్‌లు ఊగుతున్నట్టు సోషల్ మీడియా పోస్ట్‌లు చూపించాయి.
భారతదేశం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల నివాసితులు కూడా ఈ ప్రకంపనలను అనుభవించినట్లు తెలిపారు. తక్షణ ప్రాణనష్టం లేదా పెద్ద నిర్మాణ నష్టం సంభవించనప్పటికీ, స్థానిక అధికారులు పరిస్థితిని అంచనా వేస్తూనే ఉన్నారు. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ భూకంప కేంద్రం పాకిస్తాన్‌లో ఉంది. పాకిస్తాన్‌ను తాకిన రెండవ భూకంపం శుక్రవారం ఉదయం 5:14 గంటలకు సంభవించింది. నేపాల్ ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప మండలాల్లో ఒకటి.