పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని గద్రివాలా గ్రామంలో ఆరేళ్ల బాలుడు 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. అతడిని కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నివేదికల ప్రకారం, రెస్క్యూ ఆపరేషన్ కోసం సైన్యాన్ని రప్పించారు. బోర్‌వెల్ వైపు సొరంగం తవ్వేందుకు జేసీబీని ఉపయోగిస్తూ ఉన్నారు. గంటన్నర వ్యవధిలో 15 అడుగుల మేర మాత్రమే తవ్వగలిగింది. బాలుడు బోరుబావిలో 95 అడుగుల మార్క్‌లో చిక్కుకున్నట్లు సమాచారం.
ఈ ఘటన ఉదయం 9 గంటలకు చోటు చేసుకున్నట్లు సమాచారం. పిల్లవాడు వీధికుక్కల బారి నుంచి రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు... బోరుబావిలో పడిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరేళ్ల చిన్నారికి ఆక్సిజన్ అందిస్తూ ఉన్నారు. ఆ బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోర్‌వెల్‌లో తలకిందులుగా పడిపోవడంతో క్లిప్ సహాయంతో బయటకు తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న గ్రామం జిల్లా కేంద్రమైన హోషియార్‌పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.