బెంగళూరులో ఆరు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

6 Bengaluru schools get bomb threats. బెంగళూరు శివార్లలోని ఆరు పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on  8 April 2022 10:21 AM GMT
బెంగళూరులో ఆరు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

బెంగళూరు శివార్లలోని ఆరు పాఠశాలలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు పాఠశాలలకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పాఠశాలల అధికారిక ఈమెయిల్ ఐడీ లకు బాంబు బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. మొదట్లో హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎబినేజర్ ఇంటర్నేషనల్ స్కూల్, హెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విన్సెంట్ పల్లోట్టి ఇంటర్నేషనల్ స్కూల్‌లకు బెదిరింపులు వచ్చాయి. త‌ర్వాత మహదేవపురలోని గోపాలన్‌ పబ్లిక్‌ స్కూల్‌, వర్తుర్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, మారతహళ్లిలోని న్యూ అకాడమీ స్కూల్‌, గోవిందపురాలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌లకు కూడా బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

బెదిరింపు సందేశాలలో ఒకటి ఇలా ఉంది.. మీ పాఠశాలలో శక్తివంతమైన బాంబు అమర్చబడింది, ఇది జోక్ కాదు. వెంటనే పోలీసులకు కాల్ చేయండి. మీతో సహా వందలాది మంది జీవితాలు బాధపడవచ్చు. ఆలస్యం చేయవద్దు, ఇప్పుడు ప్రతిదీ మీ చేతుల్లో మాత్రమే ఉంది,, అని 'barons.masarfm@gmail.com నుండి మెయిల్ ఫార్వార్డ్ చేయబడింది. బెదిరింపుల నేఫ‌థ్యంలో.. తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసు శాఖ అవసరమైన చర్యలను ప్రారంభించిందని, పరిస్థితి అదుపులో ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. బాంబు బెదిరింపులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) పరీక్షలు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన తల్లిదండ్రుల్లో భయాందోళనకు గురి చేసింది.

అదనపు కమిషనర్ (పశ్చిమ) ఎ. సుబ్రమణ్యేశ్వరరావు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులు 99 శాతం బూటకమని, తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనసాగుతున్న పరీక్షలకు భంగం కలగకుండా పాఠశాలల ఆవరణలో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.












Next Story