నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ఎన్‌డీఏ బలపరిచిన జగదీప్ ధన్‌ఖర్ ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 72.8% ఓట్లతో జగ్‌దీప్ ధంకర్ భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మార్గరెట్ అల్వా 182 ఓట్లు సాధించగా.. జగదీప్ ధన్‌ఖర్ 528 ఓట్లు సాధించి 346 ఓట్ల భారీ తేడాతో ఆమెను ఓడించారు. ఈ విజయం తర్వాత ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జగదీప్ ధన్‌ఖర్ గురించి 5 కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి.
1. జగదీప్ ధన్‌ఖర్ 1951లో రాజస్థాన్‌లోని ఝుంజును గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు.
2. రాజస్థాన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదివారు జగదీప్ ధన్‌ఖర్. ఆపై 1979లో రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1990లో రాజస్థాన్ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
3. 1989-91లో 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఝుంజును లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనతాదళ్ అభ్యర్ధిగా ధనఖర్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆపై రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నుండి ఎమ్మెల్యేగా (1993-98) కూడా ఎన్నికయ్యారు.
4. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ధన్‌ఖర్ కాంగ్రెస్‌లో చేరారు, అయితే రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ఎదుగుదలతో బిజెపిలో చేరారు.
5. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధన్‌ఖర్ నియమితులయ్యారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని తరచూ విబేధిస్తూ ఆయన వార్తల్లో నిలిచారు.