ఆజాద్ వెళ్లిపోయారు.. మేము కూడా వెళ్ళిపోతున్నాం
5 Jammu Kashmir leaders quit after Ghulam Nabi Azad's resignation. కాంగ్రెస్ కు తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ షాకిచ్చారు.
By Medi Samrat Published on 26 Aug 2022 11:21 AM GMTకాంగ్రెస్ కు తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ షాకిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి రాసిన లేఖలో, ఆజాద్ సీనియర్ నాయకులను పక్కన పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుభవం లేని వ్యక్తుల కోటరీ కారణంగా పార్టీ నుండి నిష్క్రమించడానికి కారణమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాకే పార్టీ నాశనమైందని.. సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని విమర్శించారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వమని.. సీనియర్లు అందరిని రాహుల్ పక్కన పెట్టేశారంటూ విమర్శించారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్ జోక్యం పెరిగిందని ఆరోపించారు.
ఇక ఆజాద్ వెళ్ళిపోతే.. తాము ఎందుకు ఉండాలని అనుకుంటున్నారో ఏమో కానీ.. పలువురు నేతలు కూడా కాంగ్రెస్ ను వీడడానికి రెడీ అయ్యారు. గులాం నబీ ఆజాద్‌కు సంఘీభావంగా ఐదుగురు జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ నేతలు గులాం మహ్మద్ సరూరి, హాజీ అబ్దుల్ రషీద్, మహ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వానీ, చౌదరి అక్రమ్ మహ్మద్, సల్మాన్ నిజామీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇక గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆజాదే స్వయంగా కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలిచ్చారు. తాను జమ్ముకశ్మీర్‌కు వెళ్తున్నానని, అక్కడ సొంత పార్టీని ఏర్పాటు చేస్తానని ఆజాద్ చెప్పారు. జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యా సాధ్యాలను కూడా తర్వాత పరిశీలిస్తానని అన్నారు. వచ్చే ఏడాది జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ రాజీనామా హాట్ టాపిక్ గా మారింది.