తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది బెంగాల్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆ పార్టీ నేత మిథున్ చక్రవర్తి చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ రోజునైనా మహారాష్ట్ర తరహా పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. "ప్రస్తుతం 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉండగా, వారిలో 21 మంది నేరుగా నాతో టచ్‌లో ఉన్నారు. మహారాష్ట్ర తరహా పరిస్థితి ఏ రోజుకైనా రావచ్చు. ఇది రేపైనా జరగవచ్చు" అని మిథున్ చక్రవర్తి చెప్పారు.
బెంగాల్‌లో ఇప్పటికిప్పుడు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని.. బలవంతంగా లాక్కున్న అధికారం ఎక్కువ కాలం నిలవదన్న విషయం ఇప్పుడిప్పుడే మమతకు అర్థమవుతున్నట్లుందని విమర్శలు గుప్పించారు. కోల్ కతాలో బీజేపీ ఎమ్మెల్యేలతో మిథున్ చక్రవర్తి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. త్వరలో జరిగే పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ అధిష్టానంతో మిథున్ చక్రవర్తి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి అండగా ఉంటానని మిథున్ హామీనిచ్చినట్లు సమాచారం.