ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో శుక్రవారం చోటు చేసుకుంది.
వాన్‌లెస్‌వాడి హైస్కూల్‌లో 5, 7వ చదువుతున్న చిన్నారులు స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ కిచెన్‌లో అన్నం, పప్పు కూరతో తిన్న తరువాత అస్వస్థతకు గురైయ్యారు. మొత్తం 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 35 మందిని చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. మరొక విద్యార్థిని మాత్రం అబ్జర్వేషన్‌లో ఉంచారు. అతడికి సెలైన్ పెట్టారు. ఆ విద్యార్థి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి మోహన్ గైక్వాడ్ మాట్లాడుతూ.. వాన్‌లెస్‌వాడి హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 36 మంది విద్యార్థులు కడుపునొప్పి, వికారంతో బాధపడ్డారు. వారిలో చాలా మందికి వాంతులు అయ్యాయి. అనంతరం చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించారు. అందరిని డిశ్చార్జ్ చేయగా.. ఓ విద్యార్థి కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతడికి సెలైన్ ఎక్కించామని, అతని పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పాఠశాల, సెంట్రల్ కిచెన్ నుంచి సేకరించిన ఆహార నమూనాలను పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపినట్లు గైక్వాడ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.