మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకణ్ తీర ప్రాంతం, పశ్చిమ మహారాష్ట్రల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 60 మంది చనిపోయారు. ఎంతో మంది రాతి శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొంకణ్ లోని రాయగడ్ జిల్లా తలాయి గ్రామంలో కొండచరియలు ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో 36 మంది చనిపోయారు. ఒకే చోట 32 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో చోట నుంచి మరో 4 మృతదేహాలను తీశారు.
సతారా జిల్లాలోని మిర్గావ్ లో 12 మంది మరణించారు. సతారాలోని అంబేగార్ లో కొండచరియలు విరిగి పడడంతో పదుల సంఖ్యలో రాళ్ల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం వారందరినీ కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనన్ని వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచింది. తినడానికి ఆహారం, మంచినీళ్లు కూడా లభించడం లేదు.
భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనల్లో ఇప్పటివరకు 36 మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింది మరికొందరు చిక్కుకున్నారని రాయగఢ్ జిల్లా కలెక్టర్ నిధి చౌదరి చెప్పారు. కొల్హాపూర్ జిల్లాలోని 47 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.