లొంగిపోయిన 318 మంది ఉగ్రవాదులకు పునరావాసం కల్పించేందుకు అసోం ప్రభుత్వం ముందుకు వచ్చింది. సోమవారం నాడు ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు ప్రకటించింది. యునైటెడ్ గూర్ఖా పీపుల్స్ ఆర్గనైజేషన్, తివా లిబరేషన్ ఆర్మీ, కుకీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA), డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (DNLA) వంటి గ్రూపులకు చెందిన తీవ్రవాదులు లొంగిపోయారు.
ఒక కార్యక్రమంలో చెక్కులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, ఈ వ్యక్తులు హింసా మార్గాన్ని విడనాడి ప్రధాన స్రవంతిలో చేరారని అన్నారు. ఈ సొమ్మును మంచి కోసం, ఉపాధి కోసం వినియోగించుకోవాలని ఆయన కోరారు. DNLAలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే మొదట్లో లొంగిపోయినప్పటికీ, ఇప్పుడు మొత్తం బృందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చల్లో నిమగ్నమై ఉందని శర్మ చెప్పారు. త్వరలోనే వారంతా శాంతి ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఆయన చెప్పారు. "గత 18 నెలలుగా, ఉల్ఫా మినహా అన్ని సమూహాలు ప్రధాన స్రవంతిలో చేరాయి. చాలా మంది శాంతి ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు, "అని గత ఏడాది మే 10 న ముఖ్యమంత్రి చెప్పారు. రక్తం ద్వారా కాదు చర్చల ద్వారా అస్సాంను పునర్నిర్మించగలం, అభివృద్ధి పథంలో ముందుకు సాగగలమని శర్మ అన్నారు. గత 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6,780 మంది తిరుగుబాటు గ్రూపుల సభ్యులకు పునరావాసం కల్పించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందన్నారు.