భారతదేశంలో రోజుకు చాలా మంది చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన విషయాల ప్రకారం రోజుకు 31 మంది బలవన్మరణం చెందుతున్నారు. ఇక 2020 సంవత్సరంలో 18 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న 11,396 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఇది 2019లో చిన్నారుల ఆత్మహత్యల కంటే 18 శాతం ఎక్కువ. పిల్లల మానసిక ఆరోగ్యంపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లతో పొలిస్తే 21 శాతం చిన్నారుల మరణాలు పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదికలో తేలింది. 2018లో 9,413 మంది, 2019లో 9,613 మంది చిన్నారులు బలవన్మరం చెందారు. ఈ ఏడాదిలో 2019తో పోలిస్తే 1,783 మంది చిన్నారులు తమ ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన చిన్నారుల్లో 6,004 మంది బాలికలు, 5,392 మంది బాలురు ఉన్నారు.
అనారోగ్య సమస్యలతో 1,327 మంది, ప్రేమ కారణలతో 1,337, కుటుంబ సమస్యలతో 4,006 మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే పేదరికం, డ్రగ్స్, ఆత్మనూన్యత, నిరుద్యోగం తదితర కారణాలు చిన్నారుల ఆత్మహత్యలకు దారితీశాయని నిపుణులు అంటున్నారు. కరోనా కారణంగా విద్యా సంస్థల మూసివేత, సామాజిక జీవనానికి దూరం కావడం చిన్నారుల్లో మానసికంగా కుంగుబాటుకు గురైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై సేవ్ ది చిల్డ్రన్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ మాట్లాడారు. కరోనా కారణంగా స్కూళ్ల మూసివేత, ఇంట్లో పరిస్థితులు చిన్నారుల్లో ఆరోగ్యం క్షీణించేలా చేసిందన్నారు. మానసిక సంరక్షణ, మద్దతు లేకపోవడం ప్రధాన కారణమన్నారు. కొవిడ్ కారణంగా చిన్నారులు తీవ్ర మనోవేధనకు గురయ్యారని, ఇది మనకు అర్థం కాలేదని ఇన్‌స్టిట్యూట్ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రీతీ మహారా అన్నారు.