మధ్యప్రదేశ్‌లో సమ్మె బాటపట్టిన 3వేల మంది జూనియర్ డాక్టర్లు గురువారం తమ విధులకు రాజీనామా చేశారు. విధి నిర్వహణలో కరోనా బారినపడ్డ తమకు, తమ కుటుంబాలకు ఉచితంగా చికిత్స అందించడంతో పాటు స్టైఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్లు సోమవారం నుండి సమ్మె చేపట్టారు. అయితే.. జూనియర్ డాక్టర్ల సమ్మె చట్టవిరుద్ధమని పేర్కొన్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. 24 గంటల్లో తిరిగి విధుల్లోకి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును పట్టించుకోని జూనియర్ డాక్టర్లు తమ విధులకు రాజీనామా చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని అంటున్నారు జూనియర్ డాక్టర్లు.
ఇక రాష్ట్రంలోని మొత్తం ఆరు మెడికల్ కళాశాలల్లో జూనియర్ డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న ఈ మూడు వేల మంది గురువారం తమ రాజీనామా లేఖలను ఆయా కళాశాల డీన్‌లకు అందించారని మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎంపిజెడిఎ) ప్రెసిడెంట్ డా.అరవింద్ మీనా తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు తాము సమ్మెను విరమించుకునేది లేదని చెప్పారు. మెడికల్ ఆఫీసర్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులు కూడా ఈ సమ్మెల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమ్మెకు ఇతర రాష్ట్రాల జూనియర్ డాక్టర్లు మద్దతు తెలిపారని అన్నారు.